ఏజెన్సీలోకి వలస వచ్చిన గౌడ్ కులస్తులకు కులగణన నమోదులో బిసి బి గానే నమోదు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం చర్ల మండల కేంద్రంలో బీరబోయిన శేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1950 జనవరి 26న భారత రాష్ట్రపతి షెడ్యూల్ తెగలను గుర్తించి ఆమోదం తెలిపిన గెజిట్ ప్రకారంగానే ఏజెన్సీలో కులగణన ఆయా కులాల ప్రకారంగా నమోదు ప్రక్రియ జరగాలని ప్రభుత్వాన్ని కోరారు. RCNO2467/TRI/TEEC/2016. ది 10/07/2017 ప్రకారం ట్రైబల్ వెల్ఫేర్ కమీషనర్ హైదరాబాద్ వారి నుంచి ఏజెన్సీ ఏరియా జిల్లాల కలెక్టర్లకు సర్కులర్ జారీ చేశారని అన్నారు. ఆ విధంగా ఏజెన్సీలో నాన్ ట్రైబల్స్‌గా ఉన్న గౌడ్స్ కులస్తులు బిసి బి గ్రూపు కుల ధ్రువీకరణ పత్రాలకు అర్హులు కాబట్టి వారికి ఎలాంటి ఏజెన్సీకి సంబంధించిన ఎస్టీ సర్టిఫికెట్స్ మంజూరు చేయొద్దని ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. రాజకీయ కోణంలో రిజర్వేషన్లను చూడకూడదని మైదాన ప్రాంత జిల్లాల నుండి బతుకుదెరువు కోసం ఏజెన్సీలోకి వలస వచ్చిన గిరిజనేతర గౌడ్‌లను ఎస్టీలుగా గుర్తించమని అడగడం కడు శోచనీయం అన్నారు. ఈ సమావేశంలో పూనెం నాగేశ్వరరావు, కొమరం ప్రతాప్, కారం రాజశేఖర్, కణితి మహేష్, కణితి రాకేష్ పాల్గొన్నారు.










