భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పోలీసులు ఆరుగురు మావోయిస్టు సానుభూతిపరులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ప్రెషర్ కుక్కర్ బాంబు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం ఇన్‌చార్జి డిఎస్‌పి వి. రవీందర్ రెడ్డి మీడియాకి తెలిపిన వివరాల ప్రకారం చర్ల పోలీసులు స్పెషల్ పార్టీ, సిఆర్‌పిఎఫ్ 141 సీ సిబ్బందితో కలిసి చర్ల మండలం తాలిపేరు డ్యామ్‌కి దగ్గరలో ఉన్న టేకు ప్లాంటేషన్ అడవి ప్రాంతంలో ఏరియా డామినేషన్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అందులో ఒక వ్యక్తి దగ్గర ప్లాస్టిక్ సంచిలో ఉన్న ఎలక్ట్రికల్ వైరు కలిగి ఉన్న ప్రెషర్ కుక్కర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలీసుల విచారణలో చర్ల మండలం చెన్నాఫురం గ్రామానికి చెందిన మడకం దేవా, సోడి ఉంగా, సోడి కొసా, మడకం ఇడుమ, కలుమ అడుమ, కొవ్వాసి భీమయ్య అనే ఈ ఆరుగురు వ్యక్తులు మావోయిస్టు సానుభూతిపరులుగా తేలిందన్నారు. ఆ మేరకు వారిపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సహకరిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయకపు ఆదివాసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మీడియా సమావేశంలో చర్ల సీఐ ఏ. రాజువర్మ, ఎస్ఐ ఆర్ నర్సిరెడ్డి, సీఆర్‌పిఎఫ్ 141 సీ కంపెనీ అధికారులు పాల్గొన్నారు.










