విజయపతాక న్యూస్, చర్ల
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జాతీయ మాలమహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వినర్ తోటమల్ల రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. 
రాజ్యాంగ నిర్మాతని భారత గణతంత్ర దినోత్సవం రోజు స్మరించుకోవడం భారత పౌరులుగా మన బాధ్యత అన్నారు. చర్ల ప్రెస్‌క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ గురించి నేటి సమాజానికి ముఖ్యంగా విద్యార్థులకు, యువతీ యువకులకు అవగాహన కల్పించే విధంగా ఆనాటి సభల్లో వక్తలు ప్రసంగాలు చేయాలని కోరారు. అంబేద్కర్ ఐడియాలజీ ద్వారానే సామాజిక స్పృహ, ప్రజా చైతన్యం లభిస్తుందన్నారు. ప్రపంచ దేశాలకు అదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందిన అంబేద్కర్‌ని మరచిపోవడం అంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించకపోవడమే అన్నారు. దీనిని అంబేద్కర్‌వాదులు, ముఖ్యంగా జాతీయ మాలమహనాడు కార్యకర్తలు అంగీకరించరని అన్నారు. అంబేద్కర్ పట్ల వివక్ష చూపిస్తే సహించబోమని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మాలమహనాడు నాయకులు తడికల లాలయ్య, కొంగూరు రమణారావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యడెల్లి గణపతి, చర్ల మండల గౌరవ అధ్యక్షులు మోతుకూరి ప్రభాకర్‌రావు, మాల మహనాడు సోషల్ మీడియా ఇన్‌చార్జి బోళ్ళ వినోద్, చర్ల మండల మాలమహనాడు నూతన అధ్యక్షుడు తోటమల్ల గోపాలరావు, భద్రాచలం నియోజకవర్గ మాలమహనాడు నాయకులు తోటమల్ల రవికుమార్, కొంగూరు సత్యనారాయణ, తోటమల్ల కృష్ణ, పాముల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.










