చర్లలో ఘనంగా టిడిపి సభ్యత్వ నమోదు
తెలుగుదేశం పార్టీ నాయకులు కొడాలి శ్రీనివాస్
విజయపతాక న్యూస్, చర్ల : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని టిడిపి మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అడహాక్ కమిటీ సభ్యులు కొడాలి శ్రీనివాస్ ధీమాగా చెప్పారు. కమిటీ మరొక సభ్యులు కోనేరు రాముతో కలిసి శుక్రవారం చర్లలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. టిడిపి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కొత్తపల్లి రామాంజనేయులు చర్లలో తొలి సభ్యత్వం రెన్యువల్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కొడాలి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, పేద, మధ్యతరగతి ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసింది తెలుగుదేశం ఒక్కటే అనే నమ్మకంతో ఉన్నారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఒక రూపాయికి కిలో బియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల హృదయాలలో తెలుగుదేశం పార్టీ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. అయితే తెలంగాణలో ఇంతకు ముందు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్దికోసం తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలనుకొని ప్రజల చేతిలో చావుదెబ్బ తిన్నదని ఎద్దేవా చేశారు. పడిలేచే కెరటంలా టిడిపి ఆంధ్రాలో అధికారం చేపట్టిందని, తెలంగాణలోను పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారికి రూ 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉందని చెప్పారు. పాత సభ్యులంతా రెన్యువల్ చేసుకొని కొత్త సభ్యులను చేర్పించాలని సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చర్ల మండల టిడిపి సీనియర్ నాయకులు అంతాఉత్సాహంతో పాల్గొన్నారు.













