
* 74356 క్యూసెక్కుల నీరు విడుదల
* వరద ఉధృతి బట్టి మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం
విజయపతాక న్యూస్, చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు వరద నీటితో పరవళ్ళు తొక్కుతోంది. స్థానికంగా కురుస్తున్న వర్షాలకుతోడు రిజర్యాయర్‌కి ఎగువ భాగంలోని ఛత్తీస్‌గఢ్ దండకారణ్య వాగువంకల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యామ్ అధికారులు అప్రమత్తమైనారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరదని అంచనా వేస్తూ ప్రాజెక్టుకి ఉన్న మొత్తం 25 క్రస్ట్ గేట్లలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 16 గేట్లు పూర్తిగా ఎత్తి 74356 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లుగా డ్యామ్ ఇన్‌చార్జి డీఈఈ తిరుపతి తెలిపారు. ఆయన డ్యామ్ వద్ద మకాం వేసి వరదని అంచనా వేస్తూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. డ్యామ్‌లోకి 63997 క్యూసెక్కుల నీరు వస్తున్నదని, 74 మీటర్ల నీటి నిల్వ సామర్ద్యం కలిగిన రిజర్వాయర్‌లో 73 మీటర్ల నీటిని నిల్వ చేస్తూ అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వరద పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. డ్యామ్ నుంచి విడుదలైన నీటి కారణంగా గుంపెనగూడెం – తేగడ గ్రామాల నడుమ తాలిపేరు వాగుపై ఉన్న పురాతనకాలంనాటి లోలెవల్ చప్టా నీట మునికి దాని మీదుగా రాకపోకలు నిలిచిపోయినవి. జోరువానల వలన వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతోపాటు తాలిపేరు నుంచి విడుదలయ్యే నీటి మూలంగా భద్రాచలం వద్ద గోదావరి స్వల్పంగా మళ్ళీ పెరుగుతోంది. ఇదిలా ఉండగా ఎడతెరపులేని వానల వలన పాల్వంచ వద్ద కిన్నెరసాని ప్రాజెక్టుకి వరద తాకిడి తగిలింది..










