మినీ మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలి : మంత్రి దనసరి సీతక్క

* పనులన్నీ నాణ్యతతో శాశ్వతంగా నిలిచే విధంగా ఉండాలి

* భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు

* జాతర విజయవంతానికి అన్నిశాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలి

రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

విజయపతాక జిల్లా ప్రతినిథి,  ములుగు

ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని, ప్రతి పని నాణ్యతతో చేపట్టి శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని రాష్ట్ర పంచాయితిరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. మహా జాతర సందర్భంగా జరిగిన చిన్న చిన్న సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని మంత్రి దనసరి అనసూయ సీతక్క మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌‌బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శభరీష్, ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్‌‌లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ద్వారా చేపట్టనున్న పనుల అంచనా వివరాలను అధికారులు మంత్రికి సమర్పించారు.‌ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మినీ మేడారం జాతరను పురస్కరించుకొని గత పక్షం రోజులుగా భక్తులు రాక పెరిగిపోయిందని, ఫిబ్రవరి మొదటి వారం నుండే భక్తుల తాకిడి అధికం కానున్న సందర్భంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేడారం జాతరకు వచ్చే అన్ని లింక్ రోడ్లను జనవరి 31లోగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అమ్మవార్లను భక్తులు దర్శించుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. జాతర సందర్భంగా పారిశుద్ధ్య లోపం జరగకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని డిపిఓను ఆదేశించారు. ఐదు రోజులపాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతోపాటు పూర్తిస్థాయిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జంపన్న వాగు వద్ద మహిళా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు అవసరమైన పనులను త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌‌కు సూచించారు. జిల్లా అధికారులు సమర్పించిన అంచనాల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిధులను మంజూరు చేయిస్తానని, జాతర విషయంలో జిల్లా యంతరంగంతోపాటు ఐటిడిఏ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఎండోమెంట్ ఈఓ రాజేందర్, ఇంజనీరింగ్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   RECENT NEWS