బిఆర్ఎస్ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ తాతా మధు
విజయపతాక న్యూస్, చర్ల : నియోజకవర్గ ప్రజల ఆదరణ, బిఆర్ఎస్ కార్యకర్తల రెక్కల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు అవగాహన లోపంతో తన రాజకీయ భవిష్యత్తుని సమాథి చేసుకున్నారని ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఆదివారం చర్లలో జరిగిన బిఆర్ఎస్ పార్టీ చర్ల మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు. అధికార పార్టీలో చేరి తాత్కాలికంగా ఆయన ఆనంద పడవచ్చు. కానీ ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేదని అన్నారు. ఇంతకు ముందు ఆయన డాక్టర్ వెంకట్రావు, ఇపుడు ఎమ్మెల్యే వెంకట్రావు, తర్వాత మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు అవుతారని తాతా మధు జోస్యం చెప్పారు. బిఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచిన వెంకట్రావు తన స్వార్థం కోసం పార్టీ మారడం ప్రజలు గమనిస్తున్నారని, కొంత ఆలస్యమైనా భద్రాచలంలో ఉప ఎన్నిక రావడం ఖాయమని, ఆ ఎన్నికలో వెంకట్రావు ఘోర పరాజయం చవిచూస్తారని స్పష్టం చేశారు. ఆయన రాజకీయ జీవితంలో ఇదే మొదటి, చివరి పదవి అవుతుందని అన్నారు. వెంకట్రావుని నమ్మి మోసపోయిన బిఆర్ఎస్ శ్రేణులు చెక్కు చెదరని మనోధైర్యంతో పార్టీ బలోపేతం కోసం కంకణబద్ధులై పనిచేయాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశలను అడియాశలు చేసి భద్రాచలంలో గెలుపుకి మలుపుతిప్పిన చర్ల మండల బిఆర్ఎస్ శ్రేణులను తాతా మధు అభినందించారు.










