చర్ల మండల బిఆర్ఎస్ నాయకుడు కొటేరు శ్రీనివాసరెడ్డి ఇంటికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు వెళ్ళడం చర్లలో చర్చనీయాంశమైంది. శ్రీనివాసరెడ్డి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబధాన్ని బట్టి తేనీటి విందుకు హాజరైనట్లు కాంగ్రెస్ వలస నేతలు సోషల్ మీడియాలో ఫొటో పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. అయితే 2023 డిశంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటి ఆశీశ్శులతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా, ఎమ్మెల్యేతో ఉన్న పరిచయాలను బట్టి భద్రాచలం నియోజకవర్గం పరిథిలోని బిఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల చర్ల మండలంలో పలువురు బిఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరారు. అందులో భాగంగానే ఆ టీమ్‌తో కలిసి పనిచేసిన చర్ల మండల బిఆర్ఎస్ ప్రచార కార్యదర్శి కొటేరు శ్రీనివాసరెడ్డి ఇంటికి ఎమ్మెల్యే వెంకట్రావు మంగళవారం వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో అధికార మార్పిడి, తాము పట్టుదలతో గెలిపించుకున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ మారిన అనంతరం కొటేరు పొలిటికల్‌గా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళారని చెప్పవచ్చు. బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు కొద్దిరోజుల్లోనే కొటేరు కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.










