ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సర్వే ఎన్యూమరేటర్లను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని బొల్లోరి గూడెం 11వ వార్డులో పర్యటించి సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను పర్యవేక్షించి వివరాల సేకరణలో ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని ఎన్యూమరేటార్లను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉంటే సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో భాగంగా ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు ఇంటింటికి స్టిక్కరింగ్ వేయడం పూర్తి చేశామని శనివారం నుండి ప్రభుత్వం నిర్దేశించిన ఫారంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ప్రతి కుటుంబం నుంచి సేకరించి నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. సర్వే ఎన్యుమరేటర్లు ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా వివరాలను పొందుపరచాలని అన్నారు. దాదాపు 57కు పైగా అంశాలలో వివరాలను నమోదు చేయవలసి ఉన్నందున ఎమ్యూనరేటర్‌కు ఒక సహాయకులను నియమించుకుంటే బాగుంటదని సూచించారు. ప్రతి ఒక్క బ్లాకుకు ఒక ప్రత్యేక ఎన్యుమరేటర్ ఉండేలా జాగ్రత్తగా తీసుకోవాలని అన్నారు. అన్ని స్థాయిల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సర్వేలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. నమోదు చేసిన వివరాలను గొప్యంగా ఉంచాలన్నారు. నమోదు చేసిన వివరాలను ప్రతి ఎన్యుమరేటర్ వారికి కేటాయించిన కేంద్రాలలో డేటా ఎంట్రీ సిబ్బంది ద్వారా ఎటువంటి పొరపాటు లేకుండా ఆన్లైన్లో నిర్దిష్ట సమయంలో నమోదు చేయించాలన్నారు. ఈ సర్వే వలన ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా రూపొందించడానికి అవకాశం మెరుగవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం తదితర వివరాలను తమ వద్ద ఉంచుకొని సర్వే కోసం వచ్చే ఎన్యూమరేటర్లకు అందించి వివరాలను నమోదు చేయించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.










