సీనియర్ జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్ హంతకులను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల జర్నలిస్టు జెఏసీ డిమాండ్ చేసింది. జర్నలిస్టు ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ నల్లబ్యాడ్జీలు పెట్టుకొని చర్లలో శనివారం రాత్రి జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ సెంటర్, గాంధీ సెంటర్, పోలీస్ స్టేషన్ సెంటర్‌ల మీదుగా తిరిగి అంబేద్కర్ సెంటర్ వరకు జరిగింది. జోహార్ జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్.. ఖబడ్దార్ జర్నలిస్టు హంతకులారా.. జర్నలిస్టు హంతకులను వెంటనే అరెస్టు చేయాలి.. హంతకులను కఠినంగా శిక్షించాలి. జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.. జర్నలిస్టులకు పాలక ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి.. జర్నలిస్టుల ఐక్యత వర్థిల్లాలి.. అని పెద్దపెట్టున జర్నలిస్టులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చర్ల సీనియర్ జర్నలిస్టులు దొడ్డా ప్రభుదాస్ (సాక్షి టీవీ), గడ్డం మణికుమార్ (ఆంధ్రజ్యోతి), తోటమల్ల రమణమూర్తి (ఆంధ్రప్రభ), తదితరులు మాట్లాడుతూ చత్తీస్‌గఢ్ జర్నలిస్టులకు, చెర్ల జర్నలిస్టులకు నడుమ వార్తల సమాచారం ఇచ్చిపుచ్చుకునే విషయంలో చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, రాష్ట్రాలు వేరైనా వార్తల విషయంలో తామంతా ఒక్కటే అనే భావనతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ముఖేష్ చంద్రాకర్‌కి చర్ల జర్నలిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయని, రాజీలేని ధోరణితో వార్తలను పబ్లిష్ చేయడంలో ముఖేష్‌కి సాటి మరొకరులేరని, నికార్సైన జర్నలిజానికి నిలువెత్తు సాక్ష్యం ముఖేష్ చంద్రకర్ అని, అది జీర్ణించుకోలేకనే కసితో ముఖేష్‌ని దుర్మార్గులు హత్య చేసినట్లుగా తేటతెల్లమౌతోందని అన్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వెంటనే చంద్రాకర్‌ని చంపిన వారిని అరెస్టుచేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించి ఇలాంటి దుర్మార్గాలకు చోటులేకుండా జర్నలిస్టులకు పాలక ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో సీనియర్ జర్నలిస్టులు కొంగూరు రమణారావు, చిట్టిమల్ల శేషగిరి, జె. మురళి, యడెళ్ళ గణపతి, కొప్పుల రాంబాబు, తోటమల్ల కృష్ణ మహబూబ్, బోళ్ళ వినోద్, చారి బ్రదర్స్, లక్ష్మణ్, సందీప్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..










