భద్రాచలంలో నివసిస్తున్న శ్రీరామ్ దత్తాత్రేయ ధనలక్ష్మిల చిన్న కుమార్తె త్రివేణి డాక్టరేట్ సాధించారు. ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహరాన్ పూర్లో ఉన్న గ్లోకల్ విశ్వవిద్యాలయంలో గైడ్ ప్రొఫెసర్ క్రిషన్ పాల్ ఆధ్వర్యంలో ‘ఎంపిక చేసిన పప్పు ధాన్యాల పంటలలో వేరుముడి నిమటోడ్ల ముట్టడిపై వాయు కాలుష్య కారకాల ప్రభావంపైన అధ్యయనం’ అనే అంశంపై పరిశోధనకుగాను డాక్టరేట్ వరించింది. త్రివేణి డాక్టరేట్ సాధించడం అనేది వారి నాన్న కోరిక. ఆయన ఇపుడు బ్రతికిలేనందున ఈ ఆనంద సందర్భాన్ని తన నాన్నతో పంచుకోలేకపోవడం చాలా బాధాకరమని త్రివేణి కన్నీటి పర్యంతమయ్యారు. భద్రాచలానికి చెందిన ధనలక్ష్మి, దత్తాత్రేయ దంపతులకు నలుగురు పిల్లలు. వారిలో చిన్నమ్మాయి త్రివేణి. తండ్రి దత్తాత్రేయ పోలీసు ఉద్యోగం చేస్తూ, నలుగురు పిల్లల్ని ఉన్నత స్థాయి చదువులు చదివించారు ఇప్పుడు ఫ్యామిలీలో ఖాకి యూనిఫాంలో ఉన్నవారే అధికం. భద్రాచలంలో వీరిని పోలీస్ కుటుంబం అని పిలిచేవారు. త్రివేణి కూడా పోలీసు ఉద్యోగాన్ని కోరుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన పోలీసు కాలేకపోయారు. దీంతో తండ్రి దత్తాత్రేయ ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని కష్టాలను, కన్నీళ్లను అధిగమించి త్రివేణిని పీజీ వరకు చదివించారు. ఆయన కృషికి ఇపుడు ఫలితం దక్కింది. ఈమెకి 2011వ సంవత్సరంలో పవన్ నారాయణతో వివాహమైంది. వీరికి శ్రీవత్స, వృక్ష ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2018 నుంచి ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ మహబూబ్నగర్లో అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న ఈమె 2009 నుండి 2018 వరకు పాల్వంచ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలుగా పనిచేశారు. ఈమె భర్త పవన్ నారాయణ ప్రోత్సాహంతో వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే డాక్టరేట్ సాధించి అందరి అభినందనలు అందుకుంటున్నారు.










