భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పర్ణశాల, ఆలుబాక గ్రామాలను కొత్త మండలాలు చేయాలని టిజెఎఫ్ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి గోపగాని శంకర్ రావు విజ్ఞప్తి చేశారు. టిజెఎఫ్ అధ్యక్షులు, ఎంఎల్‌సి ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఈ రెండు కొత్త మండలాలు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇస్తామన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఎన్‌టి రామారావు మండలాల వ్యవస్థ తీసుకొచ్చారని, ఈనాటి పరిస్థితులు, ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పెద్ద మండలాల విభజనతో పరిసర గ్రామాలకు అందుబాటుగా కొత్త మండలాలు ఏర్పాటు చేయాలన్నారు. వెంకటాపురం నుంచి విడదీసి ఆలుబాక, దుమ్మగూడెం నుంచి విడదీసి పర్ణశాల మండలాల ఏర్పాటు ఎంతో ఆవశ్యం అన్నారు. పర్ణశాల మండలం అయితే పర్ణశాల రామయ్యని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు పెరుగుతాయని అన్నారు. ప్రజల డిమాండ్‌ని ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకోవాలని కోరారు. విలేకరుల సమావేశంలో భద్రాచలం డివిజన్ టిజెఎఫ్ నాయకులు పూనెం ప్రదీప్ కుమార్, రేపాక రామారావు పాల్గొన్నారు










