* ఎన్‌టిఆర్ వర్థంతి సభలో టిడిపి నేత కొత్తపల్లి రామాంజనేయులు
విజయపతాక న్యూస్, చర్ల
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదవర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించి తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న విజేత ఎన్‌టి రామారావు అని తెలుగుదేశం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కొత్తపల్లి రామాంజనేయులు అన్నారు. నందమూరి తారక రామారావు (ఎన్‌టిఆర్) 29వ వర్థంతి సందర్భంగా శనివారం చర్ల అంబేద్కర్ సెంటర్‌లోని టిడిపి దిమ్మెవద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు వైట్ కాలర్ పర్సన్స్‌కే పరిమితమైన రాజకీయాన్ని పేదవర్గాలకు అందుబాటులోకి తెచ్చి ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీల వారిని రాజకీయ రంగంలో ప్రోత్సహించి వారికి కీలకమైన పదవులు ఇచ్చి ప్రజాసేవలో బడుగు బలహీన వర్గాలను భాగస్వాములను చేసిన మహనీయుడు ఎన్‌టిఆర్ అన్నారు. ఆనాడు పేదల ఆకలి తీర్చడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక రూపాయికే కిలో బియ్యం పథకం ప్రవేశ పెట్టి జనంతో జేజేలు కొట్టించుకున్న ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ అన్నారు
టిడిపి పాలన తర్వాతనే ప్రజలకు పాలక ప్రభుత్వాలపై నమ్మకం కలిగిందని అన్నారు. బలహీన వర్గాలకు భరోసానిచ్చింది ఎన్‌టిఆర్ అన్నారు. తెలుగు ప్రాధాన్యతని, తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పి సినీ, రాజకీయ రంగాలలో ఓ వెలుగు వెలిగిన ఆ మహనీయుడిని తెలుగు ప్రజలు తమ హృదయాలలో పదిలపర్చుకున్నారని అన్నారు. సభ కార్యక్రమం అనంతరం రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చర్ల మండల మాజీ అధ్యక్షులు ఎడారి సత్యనారాయణ, మండల నాయకులు ఎడ్ల సత్తిబాబు, రేగల్ల సుధాకర్, రంగు నరసింహమూర్తి, గాదె సుధాకర్, బేత ప్రసాద్, దొర, సందీప్ పార్టీ కార్యకర్తలు అన్న ఎన్‌టిఆర్ అభిమానులు పాల్గొన్నారు










