భద్రాచలం నుంచి జగన్నాధపురం వరకు 117 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డును తక్షణం అప్‌గ్రేడేషన్ చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అనేక గిరిజన ప్రాంతాలను కలుపుతూ, పరిపాలనా సేవలు, విద్యాసంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు, అలాగే ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ ఈ రహదారి ఎంతో కీలకమైన లింక్‌గా పనిచేస్తుందని లేఖలో పేర్కొన్నారు. రహదారి ప్రస్తుత పరిస్థితి స్థానిక జనాభాకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు గణనీయమైన సవాళ్లను కలిగిస్తుందని, వర్షాకాలంలో వరదలు రవాణా సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయని, నివాసితులకు అవసరమైన సేవలను పొందడం కష్టతరం చేస్తుందని పేర్కొన్నారు. విశాలంగా లేకుండా దెబ్బతిన్న ప్రస్తుత ఈ రోడ్డు ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధిని పరిమితం చేస్తుందన్నారు. ఈ రహదారి యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తమరు రోడ్డు అప్‌గ్రేడేషన్ కోసం పరిపాలనాపరమైన అనుమతిని మంజూరు చేయవలసిందిగా కోదండ రామ్ కోరారు. మీ సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తున్నానని లేఖలో తెలిపారు










