– పౌరహక్కుల సంఘానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ
– దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు
– పౌరహక్కుల సంఘం దిష్టిబొమ్మ దహనం
విజయపతాక న్యూస్, చర్ల :
ఆయుధం వద్దు.. అక్షరం ముద్దు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చర్లలో నినాదాలు హోరెత్తాయి. పౌరహక్కుల సంఘానికి వ్యతిరేకంగా ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీలు, దళితులు చర్లలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పౌరహక్కుల సంఘానికి.. మావోయిస్టులకు ఉన్న చీకటి సంబంధం ఏమిటి…? అంటూ ప్లే కార్డులు చేతబూని కిలో మీటర్ పొడవున భారీ జన సందోహంతో ర్యాలీ సాగింది. అమాయక ఆదివాసీ దళిత బిడ్డలైన ఉయికా రమేష్, అర్జున్, బాడిస మాస, ఇల్లందుల ఏసు, పల్లెపాటి రాధలను మావోయిస్టులు అతి కిరాతకంగా హతమార్చితే పౌరహక్కుల సంఘాల నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రదర్శనకారులు నినదించారు. మావోయిస్టులతో పౌరహక్కుల సంఘానికి ఉన్న చీకటి ఒప్పందం ఏమిటని ప్రశ్నించారు. మావోయిస్టులు మారణహోమం చేస్తుంటే పౌరహక్కుల సంఘం నేతల మౌనానికి కారణం ఏంటి అని నిలదీస్తూ నినాదాలు చేశారు. ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు చనిపోతే హడావుడి చేసే పౌరహక్కుల సంఘాలు ఆదివాసీ, దళితులను అన్నలు చంపినపుడు ఎందుకు అడగడంలేదని గొంతెత్తి అరిచారు. చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన బస్టాండ్ సెంటర్ మీదుగా గాంధీసెంటర్‌కి చేరుకొని అక్కడ నిరసనకారులు తెలంగాణ పౌరహక్కుల సంఘం దిష్టి బొమ్మని దహనం చేశారు.














